సాంస్కృతిక వైవిధ్యం.. వివిధ రంగాల్లో దేశ సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తూ.. సుసంపన్న సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాజ్‌పథ్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, విదేశీ రాయబారులు, వేల మంది ప్రజానీకం సాక్షిగా జాతి గౌరవానికి చిహ్నంగా వేడుకలు సాగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సతోత్సవాలకు బ్రెజిల్ అధక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి. గగనతలంలో చినూక్, అపాచీ హెలికాప్టర్లు, 36.5 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగల ‘ధనుష్' శత్రఘ్నులు, ఏ-శాట్ ఆయుధ వ్యవస్థను పరేడ్‌లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. దాదాపు 90 నిమిషాలు త్రివిధ దళాలు, పారా మిలిటరీ బలగాలు, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ శకటాలతో కూడిన కవాతు కనువిందు చేసింది.
ఎగువ అసోం మినహా వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా సాగాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. పూర్తిగా పురుష జవాన్లతో కూడిన కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ కంటింజెంట్‌కు కెప్టెన్ తానియా షేర్‌గిల్ సారథ్యం వహించారు. రాఫిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) బృందానికి సారథ్యం వహించిన సీమా నాగ్ కూడా మహిళే. నూతనంగా నియమితులైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) హోదాలో జనరల్ బిపిన్ రావత్‌కు తొలి గణతంత్ర వేడుకలివి.